రైతులకు మేలు చేయడానికే నూతన రెవెన్యూ చట్టం
కరీంనగర్,ఆగస్ట్24: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికే నూతన రెవెన్యూ చట్టం-2024ను పటిష్టంగా రూపొందిస్తుందని అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం నాడు కలెక్టరేట్ ఆడిటోరియం లో రెవెన్యూ చట్టం -2024 ముసాయిదా చర్చా వేదిక కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై సలహాలు, సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం.. పేదలు, రైతులకు మేలు చేసే విధంగా ఉందన్నారు.
సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం-2024 ముసాయిదా ఉందన్నారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దీని రూపకల్పన జరిగిందని అన్నారు.. కొత్త చట్టంలో అధికారాల వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామ, మండల స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో భూ పరిపాలన వ్యవస్థలను బలోపేతం చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త చట్టం అవసరమైందని వివరించారు. ఈ చట్టం లో 20 సెక్షన్ లు ఉన్నాయి అని వివరించారు.
ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదాను అందరికీ అందుబాటులో ఉంచిందన్నారు. చర్చ కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను డ్రాఫ్ట్ రూపంలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయం లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని , నూతన చట్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఆగస్టు 2 నుండి 23 వరకు సి. సి. ఎల్. ఏ వెబ్ సైట్ లో అభ్యంతరాల స్వీకరణలకు తమ అభిప్రాయాలను పోస్ట్ ద్వారా గాని వెబ్ సైట్ లో గాని ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు.






