మారుమూల మండలంలో కలెక్టర్ పర్యటన
పలు అభివృద్ధి పనుల పరిశీలన
పలిమెల,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతమైన పలిమెల మండలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం విస్తృతంగా పర్యటించారు. మండలంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంస్థలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానమంత్రి కృషి సంచాయి కింద జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్‌లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు 214 ఫామ్ పాండ్‌లు మంజూరు కాగా, ఇప్పటివరకు 157 పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో ఫామ్ పాండ్‌కు సుమారు రూ.1.30 లక్షల వ్యయం అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫామ్ పాండ్‌ల నిర్మాణంలో భూపాలపల్లి జిల్లా రెండో స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫామ్ పాండ్‌ల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ :
పంకెన గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాల వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థినులకు సూచించారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తయారు చేయించిన ఉచిత యూనిఫామ్‌లను విద్యార్థినులకు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఇంటర్మీడియట్ కళాశాల భవనాన్ని పరిశీలించి, అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేసి కళాశాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్త్రీ నిధి ద్వారా 3 లక్షల రుణాల చెక్కులతో పాటు
మహిళా సంఘాలకు రూ.7.50 లక్షల రుణాలు పలిమెల మండలంలోని నాలుగు మహిళా సంఘాలకు అందచేశారు. దమ్మూరు గ్రామంలో మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌజు పిట్టల పెంపకం కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళా సంఘ సభ్యులతో మాట్లాడి వారు చేపడుతున్న ఉపాధి, ఆదాయ మార్గాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలను విస్తరించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పలిమల గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు, పెయింటింగ్ తదితర పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
అలాగే ప్రధాన రహదారి నుంచి ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారిని వెడల్పుగా, సౌకర్యవంతంగా నిర్మించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.






