కూనారం ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి
అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
పెద్దపల్లి బైపాస్ భూ సేకరణకు ప్రత్యేక దృష్టి
పెండింగ్ భూ సేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): అభివృద్ధి పనులకు అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు, కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి తదితర కీలక అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో కలిసి పెండింగ్ భూ సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
భూ యజమానుల సమస్యలు, భూ వివరాలు, రికార్డుల పరిశీలన, పరిహారం చెల్లింపులు తదితర అంశాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. భూ సేకరణ కారణంగా అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం కూనారం ఆర్‌ఓబీ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్టోబర్ 15 నాటికి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్ సింగ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






