ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్
- విద్యా ప్రమాణాల విషయంలో రాజీ ఉండదు,
- కల్వకుర్తి గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ
- అనధికారికంగా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌కు సిఫారసు
కల్వకుర్తి జులై 17 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్(Nagarkurnool District Collector) హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయి, పాఠశాల నిర్వహణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారు చదువుతున్న పాఠాలు, పుస్తకాల వినియోగం, ఉపాధ్యాయుల బోధన, ప్రతిరోజూ తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి విధులకు రాకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉండడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆగ్రహం కలెక్టర్ వ్యక్తం చేశారు.
పాఠశాలలో విధులకు హాజరైన ఉపాధ్యాయులు సరస్వతి, రజితలను కలెక్టర్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు శాతం, ప్రతిరోజూ నిర్వహిస్తున్న తరగతులు, సబ్జెక్టుల బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 94 మంది విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు హాజరైనట్లు తెలుసుకున్న కలెక్టర్, కేవలం ఇద్దరు ఉపాధ్యాయులతో అన్ని తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒకేసారి అనేక తరగతులకు బోధన చేయాల్సి వస్తే విద్యార్థుల అభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, చిన్నారులకు నాణ్యమైన విద్య అందకుండా పోతుందని, ప్రతి తరగతికి సమర్థవంతమైన బోధన అందేలా ఉపాధ్యాయులు విధుల్లో తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు.
పాఠశాల నుండి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానసపై వెంటనే సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తూ తగిన నివేదికలను తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను విస్మరించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....., ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని, అలాంటి సమయంలో ఉపాధ్యాయులు తమ బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, వారి నిర్లక్ష్యం వందలాది మంది విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రభావం చూపుతుందని,పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందించడం ప్రతి ఉపాధ్యాయుడి ప్రాథమిక బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని, ఈ లక్ష్యాలు సఫలీకృతం కావాలంటే ఉపాధ్యాయులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థుల విద్యాభ్యాసంలో అలసత్వం ప్రదర్శించే ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా లోపాలు, అనధికారిక గైర్హాజరు వంటి అంశాలు ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరగతులను సమయానికి ప్రారంభించి నాణ్యమైన బోధన అందించాలని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి తహహసిల్దార్ ఇబ్రహీం వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.






