19-02-2026 01:39:38 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.
జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కురవి మండలం నేరేడ జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా బోధన తీరును స్వయంగా పరిశీలించారు. నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అన్ని విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయాలని సూచించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డైట్ మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తరగతి గదులు పరిశీలించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను తనిఖీలు నిర్వహించాలనీ సూచించారు.