26 May, 2026 | 1:22 AM

మహిళా సంఘాల్లో కమిషన్ దందా?

26-05-2026 12:27 AM

లోన్ కావాలంటే ఎల్‌ఐసి కట్టాల్సిందే! 

అమాయక మహిళలపై బుక్కీపర్ల పెత్తనం 

సీసీ కురుమన్నకు బాధితుల ఫిర్యాదు

చిన్నచింతకుంట, మే 25: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాల్సిన మహిళా సంఘాలలో కొందరు బుక్ కీపర్లు కమిషన్ల దందకు తెరలేపింటరంట. పొదుపు సంఘాల సభ్యులకు ఆసరాగా నిలవాల్సిన వీఓఏలు, బుక్ కీపర్లు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అవతారమెత్తి సభ్యుల ఎలాగైనా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే అంటూ బలవంతపు ఇన్సూరెన్స్లను  పిండుతున్నారంటే వారి పెత్తనం ఏ మేరకు చేరిందో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమకు ఉన్న టార్గెట్లను పూర్తి చేసుకోవడానికి, అమాయక మహిళల రుణాల నుంచి బలవంతంగా డబ్బులు కట్ చేస్తున్న వైనం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది.

అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందా..?

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత మండలంలో మహిళా సంఘాల సభ్యుల రుణాలు చెల్లించడం ఇప్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వివోఏలు సభ్యులను నుంచి బలవంతంగా  ఇన్సూరెన్స్ లు కడితే మీకు రుణాలు వస్తాయని బలవంతపు వసూళ్లకు పాల్పడడంతో కొందరు మహిళా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు.

మహిళా సంఘాల సభ్యుల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ వారు కేవలం కార్యాలయానికి పరిమితం కావడంతో క్రింది స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్న మాట. పరిశీలన చేసి సభ్యులకు సమగ్రంగా వారి ఎదుగుదలకు ఉపయోగపడాల్సిన డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు చేసేలా మహిళా సంఘాల నిర్వహణ అధికారులు వ్యవహరించడంతో సభ్యులే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే దాఖలు నెలకొన్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించి సభ్యులకు మేలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

లోన్ వస్తే ఎల్‌ఐసి కట్టాల్సిందే..

మండల కేంద్రంలో స్థానిక బుక్-కీపర్లు ఎల్‌ఐసీ పాలసీల్లో చేరాలని, లోన్ కావాలంటే ఎల్‌ఐసీ కట్టాల్సిందేనని వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు మహిళా గ్రూప్ సభ్యులు ఆరోపించారు. లోన్ తీసుకున్న వెంటనే గ్రూప్ సభ్యుల నుండి ఎల్‌ఐసీ ప్రీమియం పేరిట రూ.12,000 బలవంతంగా కట్టిస్తున్నారని పేర్కొంటూ, బాధితులు బుధవారం సీసీ కురుమన్నకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

మహిళా సంఘాలకు లోన్లు మంజూరైన వెంటనే, సభ్యుల అనుమతి లేకుండానే వేల రూపాయలను ఎల్‌ఐసీ ప్రీమియంల పేరుతో మినహాయించుకుంటున్నారు. ‘మాకు ఇన్సూరెన్స్ వద్దు.. మా లోన్ డబ్బులు మాకు పూర్తిగా కావాలి‘ అని మొత్తుకుంటున్నా, ‘పాలసీ కడితేనే లోన్ ఇస్తాం.. లేకపోతే ఫైల్ ఆగిపోతుంది‘ అంటూ బుక్ కీపర్లు బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఐసీ చేస్తే ప్రతి సంవత్సరం లోన్ ఇప్పిస్తామని కుసుమలత గ్రూప్ సంఘం సభ్యులు తెలిపారు.

లక్ష ఇప్పిస్తామని రూ.80 వేలు నొక్కేశారంటా

మాకు రూ.లక్ష బ్యాంకు లోన్ ఇప్పిస్తామని చెప్పి, ఒక్కొక్కరి దగ్గర రూ.10,000 చొప్పున ఎనిమిది మంది దగ్గర స్థానిక బుక్ కీపర్ ఏకంగా రూ.80 వేలు లు వసూలు చేసింది‘ అని సఫియా బేగం అనే సభ్యురాలు కన్నీటిపర్యంతమైంది. దీనికి తోడు, మహిళా గ్రూప్ సభ్యులు బ్యాంకు లోన్ తీసుకుంటే.. ప్రతి ఒక్కరి నుండి రూ.1,000 చొప్పున స్థానిక బుక్ కీపర్లు అదనంగా కమీషన్ దండుకుంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందా అంతా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే వేధింపులు.. తొలగిస్తామంటూ బెదిరింపులు

ప్రభుత్వం ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తుండగా, ప్రైవేట్ పాలసీల పేరుతో అదనంగా భారం మోపడంపై మహిళలు మండిపడుతున్నారు. ఈ అక్రమ వసూళ్లపై నోరు మెదిపితే భవిష్యత్తులో లోన్లు రాకుండా చేస్తామని, గ్రూపుల నుంచి తొలగిస్తామని మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన వి.ఒ.ఏలు, బుక్ కీపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా వసూలు చేసిన నగదును తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయాలని స్థానిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ చేపిస్తాం: డిఆర్డిఓ నరసింహారెడ్డి 

మహిళా సంఘాల సభ్యులు లోన్ తీసుకోవాలంటే ఎల్‌ఐసీ కట్టాలనే నిబంధన ఎక్కడా లేదు. అలా బలవంతం చేసిన బుక్ కీపర్లపై పూర్తిగా విచారణ జరుపుతాం. విచారణలో తప్పు తేలితే సదరు బుక్ కీపర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- డిఆర్డిఓ నరసింహారెడ్డి