11 June, 2026 | 1:03 AM

సైబరాబాద్‌లో పారిశుద్ధ్యంపై కమిషనర్ ఫోకస్

11-06-2026 12:00 AM
  1. ఎస్‌ఏటీ ఆటోలు రోజూ తిరగాలి
  2. ‘నో బిన్, నో ట్రేడ్’ అమలు కఠినం

శేరిలింగంపల్లి, జూన్ 10 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేష న్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేయాలని కమిషనర్ అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వ హణ అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, సమర్థంగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు.

ప్రతి వార్డులో శానిటేషన్ ఆటోలు రోజూ తప్పనిసరిగా తిరిగి చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు. ఎక్కువ రోజులుగా విధులకు గైర్హాజరైన పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి నివేదించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విధించే జరిమానాల నివేదికలను ప్రతిరోజూ సమర్పించాలని తెలిపారు. వ్యాపార సంస్థల వద్ద డస్ట్బిన్ లేకుండా వ్యాపారం చేయడానికి వీల్లేదని, ‘నో బిన్  నో ట్రేడ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులతో కలిసి అన్ని వార్డుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. జోనల్ కమిషనర్లు జూన్ నెలాఖరులోగా తమ పరిధిలోని అన్ని వార్డులను సందర్శించి, గుర్తించిన సమస్యలపై చర్యల నివేదిక సమర్పించాలని సూచించారు.

వ్యర్థాల నిర్వహణలో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్గా నాలుగు రకాలుగా వేరు చేసే విధానాన్ని మూలస్థాయిలోనే క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, ఈ అంశంపై ప్రజలు, వ్యాపార సంస్థల్లో అవగాహన పెంచాలని తెలిపారు. పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకం, వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, ఇతర భారీ వ్యర్థాల సేకరణకు ఆన్-కాల్, షెడ్యూల్ కలెక్షన్ సేవల అమలు అవకాశాలను అధ్యయనం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

సమీక్షలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కమిషనర్ వివరించారు. నిబంధనల్లో పేర్కొన్న బాధ్యతలు, విధానాలు, ప్రమాణాలను క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల విజయానికి జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నివేదికలు, కట్టుదిట్టమైన అమలు కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సైబరాబాద్ నిర్మాణమే లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆయా విభాగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.