పిల్లలు మొబైల్ వీడాలి.. మైదానాల్లో మెరవాలి
- సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించేలా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం
- డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేలా క్రీడా ప్రణాళిక
- గ్రౌండ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- టీకేఆర్ ఫ్లైఓవర్‌తో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి
- 99 యాక్షన్ ప్లాన్‌తో కార్పొరేషన్‌లో సమూల మార్పులు
- 100 శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం
- ఎంఎంసీకి త్వరలోనే సొంత భవనం
- మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
ప్రస్తుత తరం చిన్నారులు స్మార్ట్ ఫోన్ల మాయలో పడి శారీరక శ్రమకు దూరమవుతున్నారని, వారిని ఆ డిజిటల్ వ్యసనం నుంచి బయటకు తీసుకువచ్చి మైదానాల వైపు మళ్లించడమే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రాధాన లక్ష్యమని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాకుండా, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా కార్పొరేషన్ బాధ్యత అని పేర్కొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధి ప్రణాళికలు, పౌర సేవల్లో తీసుకొస్తున్న మార్పులను ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా వివరించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి
పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారన్న ఆందోళనపై మీరు స్పందిస్తూ గ్రౌండ్ల అభివృద్ధి గురించి చెప్పారు. ఆ ప్రణాళిక ఏమిటి?
అవును, ఇది చాలా గంభీరమైన సమస్య. నేడు పిల్లలు ఆటపాటలు మరిచి మొబైల్ గేమ్స్, సోషల్ మీడియాలోనే గడుపుతున్నా రు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నది. వారిని క్రీడల వైపు మళ్లించేందుకు కార్పొరేషన్ పరిధిలోని గ్రౌండ్లను తీర్చిదిద్దుతున్నాం. మైదానాల్లో మంచి వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే పిల్లలు సహజంగానే మొబైల్స్ పక్కన పెట్టి ఆటల వైపు మొగ్గు చూపుతారు.
గ్రౌండ్ల అభివృద్ధిని ఎలా చేపట్టబోతున్నారు? ఏ రకమైన వసతులు కల్పిస్తారు?
ఒకే చోట ఎక్కువ మందికి ఉపయోగపడే లా గ్రౌండ్లను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఓపెన్ స్పేస్ ఉన్న ప్రాంతాల్లో రన్నింగ్ ట్రాక్‌లు, వాలీబాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ వంటి కోర్టులను ఏర్పాటుచేస్తాం. కాలనీల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ స్థానిక యువతకు, చిన్నారులకు అందుబాటులో ఉండేలా చిన్నపాటి క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తాం.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ఫ్లైఓవర్ పనుల పరిస్థితి ఏంటి?
టీకేఆర్ కాలేజీ నుంచి మందమల్లమ్మ జం క్షన్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని సాంకేతిక అనుమతులు పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు, నిత్యం ప్రయాణించే వాహనదారులకు ట్రాఫి క్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి.
మీరు అమలు చేస్తున్న 99 యాక్షన్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం?
99 యాక్షన్ ప్లాన్ అనేది కార్పొరేషన్ పరిధిలో పాలనను వేగవంతం చేసే ఒక మంత్రం. వీధి దీపాల నుంచి డ్రైనేజీ సమస్యల వరకు 99 రకాల పౌర సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే దీని లక్ష్యం. ఈ ప్లాన్ ద్వారా ప్రతి డివిజన్‌లోనూ ప్రజలకు స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తుంది.
నగర పరిశుభ్రత విషయంలో మీ తదుపరి అడుగు ఏమిటి?
మా ప్రాధాన్యం 100 శాతం ఇంటింటికీ చెత్త సేకరణ. ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతిరోజూ చెత్తను సేకరించేలా మైక్రో ప్లానింగ్ చేశాం. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరుచేసి ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. మల్కా జిగిరిని స్వచ్ఛ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం.
ఎంఎంసీకి సొంత కార్యాలయ భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట అందే లా సొంత భవనం కోసం స్థలాల అన్వేషణ సాగిస్తున్నాం. త్వరలోనే ఒక అనువైన స్థలాన్ని ఫైనల్ చేసి, భూమి పూజ చేసి నిర్మాణ పను లు ప్రారంభిస్తాం.
పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం మీరు తీసుకుంటున్న చొరవ ఏంటి?
జవాబుదారీతనం పెంచడమే మా ఉద్దేశం. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అది ఏ దశలో ఉందో నిరంతరం పర్యవేక్షిస్తు న్నాం. సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించేలా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశాం.
నిధుల వినియోగం పనుల నాణ్యత విషయంలో మీ వైఖరి?
ప్రజల సొమ్ము ప్రతి పైసా అభివృద్ధి పనులకే ఖర్చు కావాలి. పనుల నాణ్యత విషయం లో రాజీ పడే ప్రసక్తే లేదు. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుం టాం. థర్డ్ పార్టీ తనిఖీలను కఠినతరం చేశాం.
అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని ఎలా పెంచుతారు?
కార్పొరేషన్ అభివృద్ధి అనేది అధికారులతోనే సాధ్యం కాదు. ప్రజలు కూడా బాధ్యతగా పన్నులు చెల్లించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాల్లో సహకరించాలి. కాలనీ అసోసియేషన్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ వారి సలహాలు తీసుకుంటున్నాం.
చివరిగా కార్పొరేషన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం?
మన మల్కాజిగిరిని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుకుందాం. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి మైదానాలకు పంపండి. వారి ఆరోగ్యం కోసం మేము వసతులు కల్పిస్తాం. అందరం కలిసి మల్కాజిగిరిని అభివృద్ధి పథంలో నడిపిద్దాం.




