పిల్లి కోసం ఇద్దరు బలవన్మరణం
పిల్లిని తెచ్చుకోనివ్వలేదని ఒకరు, సాకిన పిల్లి చనిపోయిందని మరొకరు ఆత్మహత్య
అల్వాల్లో ఎంబీబీఎస్ విద్యార్థిని, మీర్‌పేట్‌లో బీఎస్సీ విద్యార్థిని అఘాయిత్యం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): మనుషుల కంటే మిన్నగా మూగజీవాలపై పెంచుకున్న అమితమైన ప్రేమ ఒకరి ప్రాణం తీస్తే, కనీసం పిల్లిని కూడా తెచ్చుకోనివ్వరా అన్న ఆవేదన మరొకరిని బలి తీసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠ (22) ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెకు పెంపుడు జంతు వులంటే ఇష్టం. ఒక పిల్లిని ఇంట్లోకి తీసుకురావాలని ఆమె ఆశపడింది. అయితే, పిల్లుల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని, అది ఆరోగ్యానికి మంచిది కాదని ఆమె తల్లిదండ్రులు సున్నితంగా మందలించారు.
గత కొద్దిరోజులు గా ఈ విషయంలో ఇంట్లో వాగ్వాదం జరుగుతోంది. శనివారం కూడా ఇదే అంశంపై తల్లి దండ్రులు గట్టిగా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రిన్సి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నది. మరో ఘటనలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమబిందు (20) బీఎస్సీ చదువుతోంది. గత రెండేళ్లుగా ఒక పిల్లిని కన్నబిడ్డలా సాకుతోంది. అయితే, ఆ పిల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. రెండేళ్ల అనుబంధం ఒక్కసారిగా తెగిపోవడంతో హిమ బిందు తీవ్ర మానసిక వేదనకు లోనైంది. పిల్లి లేని జీవితం తనకు వద్దనుకుందో ఏమో కానీ, తీవ్రమైన మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.




