22 March, 2026 | 2:01 AM

పెట్రోల్.. నో స్టాక్!

22-03-2026 12:39 AM
  1. రవాణా వ్యవస్థ స్తంభించే ముప్పు?
  2. హైదరాబాద్‌లో 40 శాతం బంకులు బంద్
  3. డీలర్లపై క్రెడిట్ భారం
  4. అడ్వాన్స్ కడితేనే ట్యాంకర్లు
  5. యుద్ధం సెగతో దిగుమతులపై ఎఫెక్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): నగరంలో ఇంధన సంక్షోభం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. శనివారం వాహనదారులకు పెట్రోల్ బంకుల వద్ద చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సుమారు 40 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు తగిలించి గేట్లు మూసేశాయి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఒకవైపు, ఆయిల్ కంపెనీలు అనుసరిస్తున్న కఠిన నిబంధనలు మరోవైపు సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చేశాయి.

గడిచిన కొద్ది రోజులుగా అంతంతమాత్రంగా ఉన్న ఇంధన సరఫరా, శనివారం నాటికి దాదాపుగా నిలిచిపోవడంతో నగర రవాణా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యక్తిగత పనులపై బయటకు వచ్చిన పౌరులు బంకుల వద్ద గేట్లు వేసి ఉండటం చూసి అవాక్కయ్యారు.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు తమ పాత విధానాలకు స్వస్తి పలకడమేనని తెలుస్తోంది. గతంలో పెట్రోల్ బంకులకు కంపెనీలు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించేవి. దీనివల్ల డీలర్లు ట్యాంకర్లు దింపుకున్న తర్వాత నిదానంగా విక్రయాల ఆధారంగా డబ్బులు చెల్లించేవారు. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల అనిశ్చితి, సరఫరాలో ఆటంకాల వల్ల కంపెనీలు ఒక్కసారిగా క్రెడిట్ లిమిట్ ఎత్తేశాయి.

పాత బకాయిలు వెంటనే చెల్లించడంతో పాటు, కొత్తగా పెట్రోల్ లేదా డీజిల్ స్టాక్ కావాలంటే ముందుగానే అడ్వాన్స్ కట్టాలని హుకుం జారీ చేశాయి. ఒక్కో ట్యాంకర్‌కు లక్షలాది రూపాయలు అడ్వాన్స్ చెల్లించే స్తోమత లేక అనేకమంది డీలర్లు తమ బంకులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మరోవైపు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంధన దిగుమతులకు అంతర్జాతీయంగా పెను ఆటంకం ఏర్పడింది.

ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన నౌకలు నిలిచిపోవడంతో దేశీయంగా ఉన్న నిల్వలు వేగంగా హరించుకుపోతున్నాయి. చమురు కంపెనీలు తమ డిపోల నుండి బంకులకు పంపే ట్యాంకర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే ఈ సంక్షోభానికి మూల కారణం.

సోమాజిగూడలోని రాజ్ భవన్ రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకుతో పాటు పంజాగుట్ట, బంజారాహిల్స్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో పెట్రోల్ లేదు అనే బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ ఇంధన కొరత ప్రభావం సామాన్యులపై అత్యంత తీవ్రంగా పడుతోంది. నిత్యం రోడ్లపై తిరిగే ఆటో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ బాయ్స్ తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 48 గంటల్లో సరఫరా మెరుగుపడకపోతే నగరం లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.