కేసీఆర్‌పై నిందలు వేసేందుకే కమిషన్లు
- నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్నతప్పు జరగలేదు
- ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలగలేదు
- మీడియా సమావేశంలో మాజీమంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : గత ప్రభుత్వంపై నిందలు వేసి, కేసీఆర్‌పై బురద జల్లే స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. నిబం ధనలకు విరుద్ధంగా కమిషన్ మీడియా సమావేశం పెట్టి గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పారని పేర్కొన్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారని, ప్రజలకు అన్ని విషయాలు అర్ధమయ్యాయని పేర్కొన్నారు.
కమిషన్‌కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదని, దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టిందని, జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణకు అంగీకరించి ఉండాల్సిన పనికాదని, కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి, ప్రభుత్వం మీడి యా లీకులు ఇచ్చిందని సమాధానం చెప్పా ల్సి ఉండేదన్నారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ. 6వేల కోట్ల నష్టం కాదు, అంతకు మించి లాభం జరిగిందని, లీకులను సమర్థించేలా కొందరితో మాట్లాడించారని మండిపడ్డారు. 17వేల మిలియన్ యూనిట్లు తీసుకొని ఛత్తీస్‌గఢ్‌కు రూ. 7వేల కోట్లు చెల్లిస్తే రూ. 6వేల కోట్లు దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఒప్పందం లేకపోతే 17వేల మిలియన్ యూనిట్లకు 17వేల కోట్లు చెల్లించాల్సి వచ్చేందన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే సమైక్య రాష్ట్రంలో కలపాలన్నదే వీరి కుట్ర అని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేయాలి తప్ప మరో గత్యంతరం లేదన్నారు. రూ.6వేల కోట్ల నష్టమనే కథనాల ప్రతి అక్షరం అబద్ధమని అవినీతి జరిగితే రమణ్‌సింగ్, కాంగ్రెస్ సీంఎలకు ఇచ్చారా అని నిలదీశారు. నల్లగొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో బుద్ద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆ జిల్లా నేతలు దద్దమ్మలు, గతంలో వ్యవహరించినట్లు నోరెత్తకుండా మౌనం వహిస్తున్నారని, ప్రజలు వారి పోకడలను గమనిస్తున్నారని పేర్కొన్నారు.
నాడు ఛత్తీస్‌గఢ్ నుంచి రూ. 3.90కి యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయకముందు జజ్జర్ నుంచి రూ.17కు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసేవారని తెలిపారు. హైదరాబాద్‌లో గతం లో విద్యుత్ కోతలతో లక్షల జనరేటర్లతో వచ్చిన శబ్ద, వాయు కాలుష్యానికి ఎంతోమంది క్యాన్సర్ బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు విద్యుత్‌తో రాజధానిలో కోతలు పోయి జనరేటర్లు బంద్ కావడం ఎంత మేలు జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. తమకు ఖర్చుకంటే తక్కువ ఆదాయం వచ్చిందని, ఛత్తీస్ గఢ్ పేర్కొంటే కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం మూసివేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రోషం ఉంటే ప్రారం భోత్సవానికి వెళ్లకూడదన్నారు. కోదండరాం చిన్నపదవి కోసం ఆశపడి దొంగలకు మద్దతు పలుకుతూ ఎమ్మెల్సీ పదవి కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.






