జీఎస్టీ బకాయిలపై దృష్టి
- ఎగవేతదారులను గుర్తించండి
వారి నుంచి బకాయిలు రాబట్టండి
వాణిజ్య పన్నుల శాఖకు భట్టి ఆదేశం
సచివాలయంలో ఫుల్ బడ్జెట్‌పై అంతర్గత సమీక్ష
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు జీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సూచించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ పూర్తిస్తాయి బడ్జెట్‌పై కసరత్తును ఆర్థికశాఖ ముమ్మరం చేసింది.
ఇప్పటికే బడ్జెట్ అంచనాల కోసం ఎక్సైజ్, మైనింగ్, రెవెన్యూ, ఆర్టీసీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సహా పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సచివాలయంలో అంతర్గతంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ పని తీరును అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి? అంచనాలను అందుకుంటున్నామా? అనే వివరాలను వాకబు చేశారు. వాణిజ్య పన్నుల విభాగంలో ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ సాధించిన పురగతిపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే, ఆదాయం పెరగడానికి శాఖ పరిధిలో ఇంకేమైనా మార్గాలు ఉన్నాయేమో చూడాలని సూచించారు.
వాణిజ్య పన్నుల శాఖపై స్పెషల్ ఫోకస్
రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వాణిజ్య పన్నుల విభాగం చాలా కీలకం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ శాఖకు రావాల్సిన బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ శాఖ పనితీరును పర్యవేక్షించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ నుంచి పన్నుల శాఖకు రావాల్సిన బకాయిలు సీఎం చొరవతో విడుదలయ్యాయి.
ఇదే సమయంలో ఈ శాఖలో ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్లు సమాచారం. ఆ కమిటీని నియమించిన తర్వాతే కొందరు ఇంటి దొంగల గుట్టు రట్టునట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు.. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై వారు పన్నులు చెల్లించకుండా తప్పించుకునేందుకు సాయం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తెలినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు బకాయిలు చెల్లించకుండా తప్పించుకుంటున్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలపై దృష్టి పెట్టాలని, వారి నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలని భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ అంశాలపై చర్చ
సమీక్ష సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులను పరిశీలించారు. తాచా బడ్జెట్‌లో అంచనాలపై వివరాలు సేకరించారు. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు, అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారికి చెల్లిస్తున్న వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవసరం వాణిజ్య పన్నుల శాఖలో ఉందా? అని అడిగారు.






