11 August, 2026 | 3:58 AM

కృష్ణమ్మ తీరాన వరుణుడికి ఆహ్వానం

11-08-2026 01:51 AM

వర్షాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మహా వరుణ యాగం 

  1.    108 మంది రుత్వికులు, 11 హోమ గుండాలు   
  2. ఆది పూజతో యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ దంపతులు 
  3. పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు 
  4.  హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు   
  5. వేద మంత్రోచ్ఛరణలతో పులకించిన నాగార్జునసాగర్

నల్లగొండ బ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): వర్షాలు సమృద్ధిగా కురవాలన్న మహా సంకల్పంతో నల్లగొం డ జిల్లా నాగార్జునసాగర్ వద్ద సోమవారం నిర్వహించిన మహా వరుణ యాగంతో కృష్ణమ్మ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కృష్ణానది తీరాన నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో మహా వరుణ యాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఈ యాగం చేపట్టారు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో యాగ క్రతువు కొనసాగింది. 108 మంది రుత్వికులు, 11 హోమ గుండాల్లో దేవతా ఆవాహనం చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. సోమవారం వేకువ జామున నాలుగు గంటలకే మొదలైన మహా వరుణ యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతి దంపతులు ఆది పూజ నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు.

తొలుత వేద పండితులు, రిత్వికులు మంత్రోచ్ఛారణల మధ్య విశ్వక్‌సేనుడికి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర కృష్ణానది జలంతో కలశాలను ఏర్పాటు చేసి, వాటిలో దేవతా ఆవాహనం చేసి కలశ స్థాపన చేశారు. వరుణుడి కరుణ కోసం రుత్వికులు వేద పండితులు చతుర్వేద వేద పారాయణాలు, లక్ష జపాలు పటించారు. వేద పండితులు రుత్వి కుల మంత్రోచ్ఛారణలతో విజయ విహార్ ప్రాంగణం మారుమోగింది.

మధ్యాహ్నం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యాగ స్థలాన్ని సందర్శించి పూర్ణాహుతి ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 3:20 గంటలకు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి సామగ్రిని హోమగుండంలో వేశారు.

వానలు సమృద్ధిగా కురవాలని అన్ని జలాశయాలకు జలకళ సంతరించుకుని రైతులకు ఆశించిన పంటలు పండాలని కోరుతూ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలతో విజయ్ విహార్ ఆధ్యా త్మిక శోభతో నిండిపోయింది. ప్రజలు యాగాన్ని తిలకించేందుకు జిల్లా యంత్రాం గం విజయ్ విహార్ ప్రాంగణం మొత్తం ఎల్‌ఈడి స్క్రీన్లు, ప్రవచనశాల, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మం త్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుందూరు జయవీర్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంక ర్‌నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఈవో భవాని శంకర్, పాలకమండలి సభ్యురాలు విజయరాజం, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, ప్రేమ్ కరణ్‌రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత పాల్గొన్నారు.

విజయరాజం ప్రత్యేక పూజలు 

యాగశాల వద్ద యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలు, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చిల్లప్పగారి విజయరాజం పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కృష్ణా, గోదావరి నదులతో పాటు అన్ని జలాశయాలు నీటితో నిండి రైతులకు పంటలు బాగా పండి వారు ఆనందంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. రైతుల మీద ప్రేమతో ఈ యాగాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ పెద్దలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.