విద్యా హక్కు చట్టం అమలేది?
పూర్తి స్థాయిలో ఎందుకు అమలుచేయటంలేదు: ఆదేశం
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 రాష్ట్రంలో ఏ స్థాయిలో అమలు జరుగుతున్నదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ చట్టం పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. చట్టం అమలు తీరును వివరించాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, చట్టంలో 121సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25 శాతం సీట్లను కేటాయించాలన్న నిబంధన అమలు చేయటం లేదంటూ న్యాయవాది యోగేష్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా ఇస్తున్నట్లు ఎక్కడా లేదని తప్పుపట్టింది. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరో పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో టాయిలెట్స్, బాత్రూమ్స్, పరుపులు, దిండ్లు, అగ్ని మాపక యంత్రాలు వంటివి లేవనే వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విద్యా హక్కు చట్టంపై కోర్టుకు సహాయకారిగా (అమికస్‌క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది సునీల్ బీ గణు అందజేసిన వివరాల పట్ల ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.






