4 May, 2026 | 12:51 AM

దిల్జిత్ దోసాంజ్ కన్సెర్ట్‌లో కలకలం

04-05-2026 12:06 AM
  1. ఖలిస్థానీ వేర్పాటువాదుల జెండాల ప్రదర్శన
  2. పంజాబ్ సమస్యల గురించే మాట్లాడతానన్న దిల్జిత్

ఒట్టవా, మే 3: కెనడాలో తాజాగా జరిగిన దిల్జిత్ దోసాంజ్ కన్సెర్ట్‌లో కలకలం రేగింది. కాల్గరీలో ఆయన ప్రదర్శన ఇస్తుండగా కొంద రు ఖలిస్థాన్ అనుకూల జెండాలను ప్రదర్శించారు. దీనిని గమనించిన దిల్జిత్ వెంటనే పాట ను ఆపేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తూ, ఆ వ్యక్తులను వేదిక వద్ద నుంచి పంపించివేయాలని నిర్వాహకులను కోరారు. ఆ జెండాలు భారత్ లో నిషేధిత సంస్థకు చెందినవి కావడం గమనార్హం.

ఈ సందర్భంగా దిల్జిత్ వేదికపైనే తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను ఏ వేదికపైకి వెళ్లినా పంజాబ్ సమస్యల గురిం చే మాట్లాడతానని, అది రాష్ట్రం కోసమని స్పష్టం చేశారు. గత ఏడాది ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) కార్యక్రమానికి వెళ్లడంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జాతీయ మీడియా పంజాబ్ గురించి మాట్లాడటం లేదని అందరూ అంటుంటారని, అందుకే తాను ఆ వేదికను పంజాబ్ సమస్యలను వినిపించడానికి వాడుకున్నానని తెలిపారు.

‘నేను ఎక్కడికి వెళ్లినా పంజాబ్ గొప్పతనం చాటుతాను. ఒక టీవీ షోలో కూర్చున్నందుకు మీకు ఇంకా సమస్య అయితే.. ఎన్ని జెండాలు ఊపుకుంటారో ఊపుకోండి, నాకు అభ్యంతరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. హాలీవుడ్ షో ‘ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్’లో పాల్గొనడం వెనుక ఉద్దేశం కూడా పంజాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తేవడమేనని వివరించారు. గతంలో భారతీయులకు కెనడాలో ప్రవేశం నిరాకరించిన ‘కోమగాట మారు’ ఘటనను గుర్తు చేస్తూ.. ఇప్పుడు అదేచోట వేల మంది పంజాబీలు గర్వంగా వేడుకలు చేసుకోవడం కాలం మార్పుకు నిదర్శనమని దిల్జిత్ పేర్కొన్నారు.