3 August, 2026 | 5:19 PM

భవన నిర్మాణ కార్మిక సంఘానికి నష్టపరిహారం ఇవ్వాలి

03-08-2026 04:11 PM

ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో భవనం నిర్మించి అప్పగించాలి.. ప్రజావాణిలో సీపీఐ వినతి

గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన పల్లెపహాడ్ గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి, పునరావాస కాలనీలో భవనం నిర్మించి ఇవ్వాలని సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శివలింగ కృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పల్లెపహాడ్ గ్రామంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం ముంపునకు గురైందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మిక సంఘానికి గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఫ్లాట్ కేటాయించి, సంఘ కార్యాలయ భవనాన్ని నిర్మించి అందించాలని కోరారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లెపహాడ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు గూడూరు స్వామి, ఉపాధ్యక్షుడు శనిగరం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శివలింగ స్వామి, సహాయ కార్యదర్శి రుద్రారం మల్లేశం, ఎల్లం భూమయ్య, పోచయ్య, మల్లేశం, సాయిలు, రాజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.