17 August, 2026 | 11:51 AM

సీఎంపై ఫిర్యాదు.. విచారణకు ఆదేశాలివ్వండి

24-05-2024 01:36 AM

హైకోర్టులో బీజేపీ పిటిషన్

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, దీనిపై దాఖలుచేసిన ప్రైవేటు పిటిషన్‌ను స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించటంలేదంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వెంకటేశ్వర్లు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. తమ పిటిషన్‌ను విచారించేలా కిందికోర్టును ఆదేశించాలని కోరారు.

ఈ నెల ౪న జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎన్నికల్లో ౪౦౦ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ప్రకటనతో బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఆరోపించారు. ఆ ప్రకటనపై తాము ఈ నెల ౧౪న ప్రైవేటు పిటిషన్ దాఖలుచేస్తే, కిందికోర్టు ౨౨న విచారణ చేపట్టిందని గుర్తుచేశారు. 

విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పట్టించుకోలేదని, కేసు విచారణను జూలై ౪వ తేదీకి వాయిదా వేశారని గుర్తుచేశారు. వెంటనే ఫిర్యాదుదారుడి వాగ్మూలాన్ని నమోదుచేసి విచారణ చేపట్టేలా కిందికోర్టును ఆదేశించాలని తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.