17 August, 2026 | 12:48 PM

ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ భూస్థాపితం

24-05-2024 01:35 AM

మేడిగడ్డ బరాజ్‌లా కుప్పకూలుతుంది 

కాంగ్రెస్ 12 సీట్లలో విజయం సాధిస్తుంది 

గులాబీ పార్టీకి రెండు, మూడు చోట్ల డిపాజిట్ రాదు 

పదవి లేదని కేటీఆర్‌లో ఫ్రస్టేషన్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని, మేడిగడ్డ బరాజ్ తరహాలోనే బీఆర్‌ఎస్ కుప్పకూలుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కవిత జైలుకు వెళ్లిందని, పదవి పోయిందన్న బాధతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని, బీఆర్‌ఎస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మంత్రుల నివాసంలోని తన ఛాంబర్‌లో గురువారం  మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు సీఎంను కేటీఆర్ తిడుతున్నారా? అని ఆయన నిలదీశారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అభివృద్ధి చేశామని చెబుతున్న కేటీఆర్.. అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే కట్టిన తాము ఏమనాలని ప్రశ్నించారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. వైన్‌షాపుల పేరు మీద అమాయకుల నుంచి రూ.2,500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని, దొడ్డు వడ్లు పండించిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. 

వచ్చే నెలలో విదేశీ పర్యటన.. 

జూన్ 6,7,8 తేదీల్లో తాను, మంత్రి శ్రీధర్‌బాబు కలిసి విదేశీ పర్యటనకు వెళ్లుతున్నామని, వివిధ కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎంసీఏ నిబంధనల మేరకు 14 అంతస్థులకు కుదిస్తామన్నారు. బీజేపీఎల్పీ నేతగా మహేశ్వర్‌రెడ్డి  నియామకమై నెల రోజులే అయిందని, కానీ ఇప్పటివరకు ఆర్టీఐ కింద 70 లేఖలు రాశారని మంత్రి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులను అనుమతి లేకుండానే నిర్మించారని కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎల్పీ పదవీ కేటీర్‌కు ఇస్తే హరీశ్‌రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

మంత్రి వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలు

మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కోలాహలంగా జరిగాయి. మంత్రుల నివాసానికి కార్యకర్తలు, అభిమానులు వచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు.