27 February, 2026 | 10:14 PM

Breaking News

కృష్ణపెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ పై ఫిర్యాదు

27-02-2026 08:27 PM

- విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని AISB డిమాండ్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కృష్ణపెల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వార్డెన్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐఎస్బి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారికి ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్ సమయపాలన పాటించకుండా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులకు వారంలో ఐదు రోజులు ఒకే తరహా కూరలు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో అరోపించారు.

కడుపునొప్పి లేస్తే ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా మాత్రలు ఇచ్చి విద్యార్థులను పడుకోమంటున్నారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించి తప్పుడు లెక్కలు జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల కోసం ఉపయోగించే సిక్ రూమ్ ను హాస్టల్ వార్డెన్ తన సొంత ఉపయోగాలకు వాడుకుంటున్నారు.

హాస్టల్లో ఫ్యాన్లు, లైట్లు పనిచేయడం లేదని తెలిపారు.  వెంటనే విచారణ చేపట్టి హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే జిల్లా కలెక్టర్ కి, ఐటిడిఏ పిఓ కి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, గిరిజన శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.