13 April, 2026 | 5:27 PM

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు

13-04-2026 04:25 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని పచ్చటి పంట పొలాల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా వెంచర్ వేస్తున్నారని సోమవారం ప్రజావాణిలో రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన తూమింట చెన్నయ్యతో పాటు పలువురు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

పాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 19AA/1, 19AA /2/2, 20AA2/1/1, 20E1/1/1, 20E1/2/1 ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు రైతుల అనుమతి లేకుండా, డీటీసీపీ అనుమతులు లేకుండానే పంట పొలాల్లో రోడ్లు వేసి వెంచర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సుమారు 33 గుంటల మేర రహదారి కూడా వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తమ పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని ఈ అక్రమ వెంచర్‌పై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.