హెచ్‌ఎంటీ చెరువు కాలుష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
దుమ్ము, వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు.. తక్షణ చర్యలు కోరిన స్థానికులు
ఉప్పల్ విజయక్రాంతి: నాచారం హెచ్‌ఎంటీ చెరువు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న దుమ్ము, వ్యర్థాల కాలుష్యంపై స్థానికులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. చెరువు అభివృద్ధి పనుల సందర్భంగా మట్టి, వ్యర్థాలను తరలించే వాహనాల వల్ల రోడ్లపై మట్టి పేరుకుపోయి గాలిలో అధికంగా దుమ్ము వ్యాపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్యం కారణంగా కాలనీల్లో నివసించే ప్రజలు అలర్జీలు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు, నాచారం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను వెంటనే తొలగించి దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు పొన్నాల రాజు (రెబల్ రాజు), ఓఫే, షేక్ సోఫీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.






