10 May, 2026 | 6:22 AM

హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ

30-08-2024 04:00 AM
  1. కమిషనర్ చర్యలతో పెరుగుతున్న ఫిర్యాదులు 
  2.   పలు ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ సంఘాలు 
  3.   ఫుట్ పాత్ ఆక్రమణలపై చర్యలకు డిమాండ్
  4.   హైడ్రాకు వచ్చిన గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ 
  5.   ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న పోలీసులు 
  6.   కమిషనర్ విల్లింగ్ కోసం హైడ్రా కార్యాలయానికి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడంతా హైడ్రానే హాట్ టాపిక్‌గా మారింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చేపడుతున్న చర్యలు అన్ని వర్గాల ప్రజలను హర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తక్షణమే స్పందిస్తున్న తీరు, సేకరిస్తున్న వివరాలతో ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, ఆక్రమణ బాధితులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు. 

చెరువుల పరిరక్షణ కమిటీలు 

మల్కాజిగిరి గౌతంనగర్‌లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని స్థానిక మహిళ గత 30 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో హైడ్రా కార్యాలయానికి వచ్చి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న విషయాన్ని కమిషనర్‌కు వివరించారు. తక్షణమే స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసిన హైడ్రా కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లేదంటే తామే వచ్చి కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన పలువురు చెరువుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి స్థానికంగా 16 చెరువులు కబ్జాకు గురైనట్టు కమిషనర్‌కు వివరించారు. ఇలా హైడ్రా కార్యాలయానికి సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన మాజీ అధికారులు సైతం ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. 

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు 

సామాన్యులు, బాధితులు ఫిర్యాదు చేయడం సాధారణమే. కానీ, గోషామహల్ లో ఫుట్‌పాత్ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా గోషామహల్ ట్రాఫిక్ పోలీ సులు ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి రావడం సంచలనంగా మారింది. నెల రోజుల్లోనే 18 ప్రాంతాల్లో సుమారు 200 నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో ట్యాంక్‌బండ్ సమీపంలోని బుద్ధ భవ న్ హైడ్రా కార్యాలయానికి చెరువులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు చేసేవారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 70 నుంచి 80కిపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది ఫిర్యాదులు చేయడానికి వస్తుండగా.. కొందరు పోలీసులు హైడ్రాలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ విల్లింగ్ కోసం తిరుగుతుండటం విశేషం.