17 April, 2026 | 3:23 AM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి

17-04-2026 12:00 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కూసుమంచి, ఏప్రిల్ -16(విజయ క్రాంతి): జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణతో గ్రామాలలో సమగ్ర మార్పు తీసుకురావాలని  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉన్న సమస్యలను స్థానిక నాయకత్వంతోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసిందని తెలిపారు.

ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పరిష్కరించాలని, ముఖ్యంగా శానిటేషన్, వీధి దీపాల నిర్వహణ, మల్టీ పర్పస్ వర్కర్లకు సమయానికి వేతనాల చెల్లింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయగా, ఖమ్మం జిల్లాకు సుమారు 16 వేల 500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.  ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

కూసుమంచి మండలంలో కొత్త జూనియర్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలకు పునాది పడిందని, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కూసుమంచి మండలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్, కూసుమంచి మండల ఇన్చార్జి ఎంపీడీవో రాజారావు, తహసీల్దార్ సైదులు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాణి, హెచ్ ఓ అపర్ణ, ఎంఈఓ వీరస్వామి, ఐసిడిఎస్ ఉమా,  వైద్యాధికారి డాక్టర్ సాయి, వెటర్నరీ డాక్టర్ నీలకంఠం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.