7 May, 2026 | 5:51 AM

సమగ్ర ఆర్థిక సర్వే జరగాలి

24-05-2024 12:05 AM

ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక పెళ్లి చేయాలంటే ప్రణాళికలు ఎలా వేస్తామో నూతనంగా ఏర్పడిన దేశాభివృధ్ధి కోసం వాస్తవిక దృష్టితో కూడిన బృహత్ ప్రణాళికలు కావాలి. భారతదేశంలో అలా జరిగి వుంటే, పరిస్థితులు ఇలా వుండేవి కావు. అనేకమంది ప్రభుత్వ అధికారుల్లోను, ప్రజా ప్రతినిధుల్లో అవినీతి పెరిగిపోయింది. అక్రమ సంపాదనకు మార్గాలు ఏర్పడ్డాయి. పనులు చేయకుండానే బిల్లులు పాస్ చేయించుకోవడం, రాజకీయ  నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో ప్రభుత్వ పథకాలు నీరుకారి పోతున్నాయి.

‘గరీబీ హఠావో’ ఏమైంది?

ఇందిరాగాంధీ  ‘గరీబీ హఠావో’ నినాదం కొంతవరకు ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, కేంద్రం  గ్రామాలకు విడుదల చేస్తున్న నిధుల్లో 90 శాతం మధ్యలోనే ఆవిరి అవుతున్నదనే సత్యాన్ని కనుగొన్న నాటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ‘జవహర్ రోజ్ గార్ యోజన’ కింద ఏకంగా ఢిల్లీనుండి గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేశారు. ఈ విధంగా అనేక పేదరిక నిర్మూలన పథకాలతో 2017 వరకు వేలాది కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేసినప్పటికీ,  ఖర్చు చేస్తున్న నిధులకు, జరుగుతున్న అభివృద్ధికి పొంతన లేదు.

నాటి జనాభా లెక్కల ప్రకారంగా 1970 దశకంలో ప్రజలకు రేషన్ కార్డులను ఇచ్చారు. ఆ తరువాత ఒకటి రెండు సార్లు ఇచ్చినప్పటికీ ఊళ్ళో సర్పంచ్ చెపితే లేదా మరెవరో సిఫార్సు చేస్తే వచ్చినవి కానీ వీటిమీద సమగ్ర సర్వే లేదు.  ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రేషన్ కార్డుదారులందరికీ బియ్యం, గోధుమలు, చక్కెర, కొన్నిసార్లు ఉప్పులు, పప్పులు ఇస్తున్నారు. ప్రధానమంత్రి ‘గరీబ్ కల్యా ణ యోజన’ కింద ప్రస్తుతం 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రేషన్ వస్తువులు అందుతున్నాయి. తెలంగాణాలో ఈ సంఖ్య 84 లక్షలు ఉంది. ఫుడ్ సెక్యూరిటీ, అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజనలాంటి అనేక పథకాలద్వారా కోటా నుకోట్ల రేషన్ ప్రజలకు అందుతున్నది. ఒక్క రేషన్ మాత్రమే కాదు, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలైన పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కల్యా ణ లక్ష్మిలు అన్నీ కూడా నాడు ఇచ్చిన రేషన్ కార్డుదారులకు మాత్రమే అందుతుంటే కొత్తవారి పరిస్థితి ఏమిటి? పేదరి కం పేరుతో దశాబ్దాలుగా లబ్ది పొందుతున్న వీరి మీద సమగ్ర సర్వే అవసరం. 

ఎవరు నిజమైన పేదలు?

గత నాలుగు దశాబ్దాలుగా వీరి జీవన విధానంలో మార్పు లేదా   వీరిలో నిజంగానే అసలు తినడానికి తిండి, కట్టుకో వడానికి బట్ట లేనివారు ఇంకా వున్నారా అనేది సర్వే చేస్తే గానీ తెలియదు. గత 45 ఏళ్ల కాలంలో ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు  వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు, నిర్మాణ రంగం విస్తృత మైన స్థాయిలో  పెరిగాయి. కోట్లలో డబ్బులు చెలామణి అవుతున్నది. ఈ పరిస్థితిలో దేశం మొత్తంలో కూడా సామా జిక ఆర్థిక సర్వే చేపట్టాల్సిన అవసరం వుంది. ఎవరు పేదవారు? ఎవరు కాదు? అనే నిర్ధారణకు ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సిన అవసరం వుంది. నిజమైన పేదలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలి గానీ, పేదల పేరుతో దశాబ్దాలుగా ఇంకా పాతవారికే  ప్రభుత్వ ఫలా లను అందించడం భావ్యం కాదు. 

- కన్నోజు మనోహరా చారి