వృథా ప్రయాస
బీజేపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తగా మాట్లాడాలని, మతం, కులం, భాష పరంగా విద్వేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీలను తీవ్రంగా హెచ్చరించడం ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ స్టార్ క్యాం పెయినర్లయిన ప్రధాని మోడీ, అమిత్ షా తదితర నేతలు, అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే తదితరులు ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలు వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మేధావి వర్గాలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం ఈసీ ఈ రెండు పార్టీల అధ్యక్షులు నడ్డా, మల్లికార్జున ఖర్గేలను ఆదే విషయంపై హెచ్చరించింది కూడా. అయినా, ఆ పార్టీల ప్రచారంలో కానీ, నేతల ప్రసంగాల్లో కానీ ఎలాంటి మార్పూ రాలేదు సరికదా, విద్వేష ప్రసంగాలు మరింత ఎక్కువ అయ్యాయి. తమ నోటీసులకు ఆయా పార్టీలు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కూడా తాజా నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో అయిదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ జరిగే నియోజక వర్గాల్లో ప్రచారమూ ముగిసింది. ఇక మిగిలింది చివరి విడత పోలింగ్ మాత్రమే. ఈ దశలో ఈసీ చేసిన హెచ్చరికవల్ల ఫలితం ఏమయినా ఉంటుందా? అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఎన్నికల్లో గెలవాలని ఏ పార్టీ అయినా, అభ్యర్థి అయినా అనుకుంటారు. అందుకోసం అన్ని విధాలా ప్రయత్నిస్తారు.
కానీ, గతంలో జరిగిన ఎన్నికలకు, ఈసారి ఎన్నికలకు స్పష్టమైన తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.గతంలో జాతీయ ఎన్నికల్లో దేశం ఎదుర్కొంటున్న స్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తామేం చేయాలనుకుంటున్నామో చెప్తూ పార్టీలు, నేతలు ప్రచారం చేసేవారు. అధికార పార్టీ అయితే తమ హయాంలో జరిగిన అభివృద్ధిని, తిరిగి అధికారంలోకి వస్తే ఇంకా ఏం చేయాలనుకునన్నామో చెప్పేది. ప్రతిపక్షమైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకన్నా మెరుగైన అభివృద్ధిని అందిస్తామని ఓటర్లకు హామీ ఇవ్వడం ద్వారా గెలవాలనుకునేది. వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. అంతా హుందాగా సాగేది. ఈసారి ఎన్నికల్లో అవన్నీ తెరమరుగయ్యాయి. ప్రత్యర్థి పార్టీని, ఆ పార్టీ నేతలను విమర్శించడమే ప్రధానమైంది. ‘త్వం శుంఠ అంటే త్వం శుంఠ’ అన్న చందంగా సాగింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తే అలాంటి విమర్శలు చేస్తూ ఉంటే మిగతా నేతలు ఊరుకుంటారా? అధికార పార్టీకి ఉన్న వెసులుబాటు ప్రతిపక్షాలకు ఉండదు కాబట్టి, వారు ప్రచారంలో ప్రత్యర్థి లేదా ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీని విమర్శించారంటే అర్థం ఉంది. కానీ, అధికార పార్టీ సైతం ఆ స్థాయికి దిగాల్సిన అవసరం లేదు. ‘దేశంలోని నాణ్యమైన ఎన్నికల విధానాన్ని రెండు పార్టీలు చెడగొట్టొద్దు’ అంటూ ఈసీ పంపిన లేఖలో పేర్కొనడం ఇప్పటిదాకా ఆ పార్టీల నేతలు చేసిన ప్రసంగాల తీరుకు అద్దం పడుతోంది.
ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఈసీ చేసిన హెచ్చరిక ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందం’గా మాత్రమే ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుంచే ‘మోడల్ కోడ్’గా చెప్పుకునే ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమలులోకి వచ్చింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు ప్రచారం సందర్భంగా ఎలా ప్రవర్తించాలో చెప్పేదే ఈ కోడ్. దాన్ని ఏమాత్రం పట్టించుకో కుండా ప్రధాన పార్టీల ప్రచారం సాగింది. దాదాపు నెలన్నరపాటు సాగిన ప్రచారపర్వంలో కొన్ని వందల సభలు జరిగాయి. ఈ సభల్లో ఆయా పార్టీల నేతలు చేసిన ప్రసంగాల పూర్తి వివరాలు ఈసీ దగ్గర ఉండనే ఉంటాయి. అయినా, ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు చివరి క్షణాల్లో చేసిన హెచ్చరికలవల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ ఎన్నికలను ఓ గుణపాఠంగా తీసుకుని తదుపరి ఎన్నికల్లోనైనా ఇలాంటి ప్రచారం జరక్కుండా చూడడానికి కోడ్‌లో మార్పులు చేయాలేమో ఆలోచించాలి. లేకపోతే ఇదే ఆనవాయితీగా మారిపోతుంది.






