విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్ర తనిఖీలు
అశ్వరావుపేటలో కలెక్టర్ అంకిత్ పర్యటన
అశ్వరావుపేట ఏప్రిల్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతిపాదిత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి వాటి నాణ్యతను సమీక్షించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించి, నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేస్తూ సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే చింతపండు, కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించి ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని ముందుగా పూర్తిగా పరిశీలించిన తర్వాతే అందించాలని 8,9,10 వ తరగతి విద్యార్థులను ఆహార పరిశీలనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయంపై సిబ్బందిని ప్రశ్నించారు. అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఔట్ పేషెంట్ విభాగం, వార్డులు, రక్త పరీక్ష కేంద్రం, మందుల నిల్వ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాఖ అధికారులు రోగులకు అందించే ఆహారం పై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఆర్‌ఎంఓ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు సంగీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




