19 April, 2026 | 10:14 AM

సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

08-12-2024 10:17 PM

సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి

టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్

ఇల్లెందు (విజయక్రాంతి): సమగ్ర శిక్షా ఉద్యోగులు గత మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ లో చేస్తున్న రిలే నిరసన దీక్షలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ (టేకులపల్లి) పాల్గొని వారికి మద్దతును, సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా అభియాన్ లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క సర్వీసును రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే క్రమబద్ధీకరించి మాట నిలుపుకోవాలని, ఈ లోగా వారికి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని, వారి యొక్క ప్రధాన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమగ్ర శిక్షా ఉద్యోగులు వారి యొక్క పూర్తి సమయాన్ని ఉద్యోగ విధులకే కేటాయిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ, రాష్ట్ర విద్యాశాఖ పథకాలు సజావుగా అమలు కావడంలో సహకరిస్తున్న, కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆ పాఠశాలల్లోని విద్యార్థినీలకు నాణ్యమైన విద్యనందిస్తూ 24 గంటలు పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నాణ్యమైన విద్యను అందించడంలో, పాఠశాల విద్యా బలోపేతంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ దీక్షా శిబిరంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి.ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వి.సరియా, ఎస్ఎస్సి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోహన్ భూక్య, ప్రధాన కార్యదర్శి చందు భట్టు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. సిద్దు, ముఖ్య సలహాదారు వనమా సురేష్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.