సమస్యల వలయంలో ఆరో వార్డు
అనంతగిరి (విజయక్రాంతి): మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో ఆరో వార్డులో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సమస్యలను పరిష్కరించే అధికారి కానీ నాయకుడు కానీ లేకపోవడం బాధాకరమని వార్డులో నివసిస్తున్న దాములూరు లక్ష్మయ్య ఆరోపించారు తమ వార్డులో కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని కోతులు తీవ్రమైన ఆస్తి నష్టం కలిగించడమే కాకుండా జనావాసాలలో సంచరిస్తూ మనుషుల మీదికి దూసుకొస్తూ గాయపరుస్తున్నాయని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ స్పందించడం లేదని ఆ వార్డులో నివసిస్తున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆరో వార్డులో భాగమైన మా వీధిలో పారిశుధ్యం కూడా కొరబడిందని ఆరోపిస్తున్నారు, రెండు వీధులను కలిపే మధ్యలో మురికి కాలం ఉండడం దానిపై ఇప్పటివరకు కూడా సిమెంటు రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. రోడ్డు అవతల వైపు దాటాలి అంటే మురుగు కాలువలో పడే పరిస్థితి ఏర్పడిందని వృద్ధులకు చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా పరిణమించిందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదని వార్డులో నివసిస్తున్న మహిళలు ఆరోపిస్తున్నారు.






