వారు పోయి వీరొచ్చే!
బ్రాహ్మణ పాలన అంతమైంది..
- 40 ఏళ్లుగా కమ్మ, రెడ్ల పాలనే నడుస్తోంది
- ఆంధ్రప్రదేశ్‌లో కులపాలనపై ఆల్ ఇండియా బహుజన్ సమాజ్‌పార్టీ ధ్వజం
- ఇప్పటికీ 111 బీసీ, 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టని వైనం
హైదరాబాద్, ఏప్రిల్ 1౮ (విజయక్రాంతి): కులరక్కసి రాజకీయాలు.. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌నూ పట్టి పీడిస్తున్నాయని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. 1952 నుంచి 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఏయే కులాల వారు ఎన్నికయ్యారనే గణాంకాలను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచందర్‌రావు, ఏపీ కోఆర్డినేటర్ బీ పరంజ్యోతి, ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లకె రాజారావులు పుస్తకరూపంలో విడుదల చేశారు.
1952 నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల కులాలను చూస్తే.. ఇప్పటివరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయని, ఇందులో మొత్తం 2,902 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు. ఇందులో మొత్తం బ్రాహ్మణులు 81 మంది కాగా, క్షత్రియులు 111 మంది, వైశ్యులు 51 మంది, వెలమలు 33 మంది గెలుపొందారని పేర్కొన్నారు. అలాగే రెడ్లు 658 మంది, కమ్మ కులానికి చెందినవారు 549 మంది గెలుపొందగా.. బీసీలు కేవలం 498 మంది, కాపులు 314 మంది, ముస్లింలు 54 మంది మాత్రమే గెలుపొందారు.
1955లో బ్రాహ్మణుల పాలన అంతమై.. రెడ్ల పాలన మొదలయ్యిందని, అటు తరువాత 1983 నుంచి కమ్మ, రెడ్ల పాలన సాగుతుందని వారు పేర్కొన్నారు. రాజకీయంగా బ్రాహ్మణ కులం అంతరించినట్టుగా అనిపిస్తోందని అన్నారు. మొత్తం పరిశీలిస్తే.. కేవలం 7 పెత్తందారీ కులాలు, 20 బీసీ కులాలు, కొన్ని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాల నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని, ఇ ప్పటికీ.. 111 బీసీ కులాలు, 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనేలేదని, అందు కే మనది పాక్షిక ప్రజాస్వామ్యమని వారు పేర్కొన్నారు.
జనాభా తక్కువ.. ఎమ్మెల్యేలు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం.. జనాభా అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయంగా అజమాయిషీ ఎక్కువగా ఉంది. ఇందులో కాపులు మొత్తం జనాభాలో 9.64 శాతం ఉండగా.. 1952 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 314 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు గణాంకాలు తెలిపారు. అలాగే కమ్మ జనాభా 3.31 శాతం ఉండగా.. మొత్తం 549 మంది, రెడ్డి జనాభా 4.82 ఉంటే.. మొత్తం 658 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఎన్నికల (2024)లోనూ రెడ్లు 32 మంది, కమ్మ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రాతినిధ్యమే లేదు..
ఇక జనాభాలో 2.85 శాతం ఉన్న రజక కులం వారికి, అలాగే 2.29 జనాభా ఉన్న వడ్డీలు, 1.35 ఉన్న విశ్వబ్రాహ్మణులతోపాటు దూదేకుల, నాయీ బ్రాహ్మిణ్, కుమ్మరి, ఉప్పర, ముదిరాజ్, కళావంతులు లాంటి కులాలకు ఒక్కసారికూడా అవకాశం రాలేదంటూ గణాంకాలను వారు ఉటంంకించారు.
పోరాటం ఆరంభం కావాలి
బీసీల సీట్లను సాటి బీసీలు కొట్టేయడం లేదని.. కేవలం కమ్మ, రెడ్లూ ఈ రెండు కులాల వారే బీసీల సీట్లను కొట్టేస్తున్నారని వారు తెలిపారు. ఏపీ లో యాదవుల జనాభా శాతం 6.07 ఉండగా.. ఇప్పటివరకు (1952 నుంచి 20224 వరకు) కేవలం 46 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే.. గౌడ్లు (శెట్టి బలిజతో సహా) 3.82 శాతం ఉంటే కేవలం 68 మంది మాత్రమే ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో 4.82 శాతం ఉన్న రెడ్లు 658 మంది, 3.31 శాతం ఉన్న కమ్మ 549 మంది ఎన్నికవ్వడాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 51.69 శాతం బీసీలు ఉన్నారు.
జనాభా దా మాషా ప్రకారం.. 1952 నుంచి 2024 వరకు 1,500 మంది ఎమ్మెల్యేలు కా వాలి. అలాగే ముస్లింలు (7.81 శాతం జనాభా) మొత్తం 227 మంది ఎమ్మెల్యేలుగా ఉండాలి. కానీ బీసీలు 498 మం ది, ముస్లింలు 54 మంది మాత్రమే గెలిచారని.. అంటే వీరికి జనాభా దా మాషా ప్రకారం దక్కాల్సిన మొత్తం 1,175 ఎమ్మెల్యే పదవులను దోచుకున్నారని, ఇదే సమయంలో జనాభా దా మాషా ప్రకారం.. రెడ్లు కావాల్సిన దానికన్నా 518 మంది, కమ్మ 357 మంది ఎక్కువగా ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలవారు ఇక్కడి నుంచి పోరాటాన్ని ప్రారంభించాలని ఆల్ ఇండియా బహుజ న్ సమాజ్ పార్టీ నేతలు పిలుపిచ్చారు.






