కామ్రేడ్ లింగన్న 7వ వర్ధంతి, నివాళి సభ
ఆలేరు,(విజయక్రాంతి): సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆదివాసీ నాయకుడు కామ్రేడ్ పూనెం లింగన్న 7వ వర్ధంతి సభ ఆలేరులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ మాట్లాడుతూ లింగన్నను 2019 జూలై 31న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాణాలతో పట్టుకొని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపిందని ఆరోపించారు. ప్రజా నాయకులను చంపిన ఏ పాలకుడూ ప్రజలకు దూరం కాక తప్పదని అన్నారు. లింగన్న పోడు భూముల కోసం ఆదివాసీల పక్షాన పోరాడిన నాయకుడని కొనియాడారు. అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.






