31 July, 2026 | 3:53 PM

జీవో 69 వెంటనే రద్దు చేయాలి

31-07-2026 03:12 PM

ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

భూపాలపల్లి టౌన్,(విజయ క్రాంతి): మున్సిపాలిటీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలను తగ్గించే జీవో నెంబర్ 69ను వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలో సుమారు 150 మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం రూ.17,600 నుంచి రూ.21,500 వరకు ఉన్న జీతాలు కొత్త జీవో వల్ల రూ.5,000 వరకు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం అన్యాయమని విమర్శించారు. జీతాలు తగ్గిస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.