11-09-2025 12:09:18 AM
-కొత్త ప్రధానిగా మాక్రాన్ సన్నిహితుడి నియామకం
-‘బ్లాక్ ఎవ్రీథింగ్’ అంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ప్రజలు
-200 మంది అరెస్టు
పారిస్, సెప్టెంబర్ 10: నేపాల్ అల్లర్ల తరహాలోనే ఫ్రాన్స్‌లో కూడా ప్రజాఉద్యమం కొనసాగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్న్‌ను దేశ ప్రధానిగా నియమించడంతో కోపోద్రిక్తులైన ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరిట రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, దాదాపు 200 మందిని అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మాక్రాన్ కొత్త ప్రధాని నియామకం చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ నియామకంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 80 వేల మంది పోలీసులను మోహరించారు. అయినా నిరసనలు మాత్రం చల్లారడం లేదు. ఈ ఆందోళనలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిరసనకారులు స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు. కొత్త ప్రధానిగా లెకోర్న్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ నిరసనలు మరింత ఎక్కువయ్యాయి.