calender_icon.png 18 February, 2026 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రబెల్లి కంటతడి

18-02-2026 12:06:24 AM

మెజారిటీ లేకున్నా మోసంతో కాంగ్రెస్ గెలుపు 

ఇట్లైతే రాజకీయాలు చేయలేం

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఆవేదన

మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ‘తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. 16 కౌన్సిలర్లకుగాను 9 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలిచి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను గెలుచుకోవడానికి ఓట్లు వేసి గెలిపించారు. పదవీకాంక్షతో కాంగ్రెస్ అండతో అక్రమంగా ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొడ్డి దారిలో మోసపూరితంగా వ్యవహరించి అప్రజాస్వామిక పద్ధతిలో తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని డ్రా పేరుతో దక్కించుకుంది. ఇటువంటి పరిస్థితి 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు.

ఇట్లైతే ఇక రాజకీయాలు చేయలేము’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇంత నీచంగా పదవుల కోసం దిగజారడం దారుణమన్నారు. అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్  నేతలు ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారాన్ని లాక్కున్నారని విమర్శించారు. పోలీసులను భారీగా మోహ రించి, తమను కదలకుండా చేసి, కేవలం వారికి అనుకూలంగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లను వేయించుకోవడం పరమ దుర్మార్గమన్నారు.

వరంగల్ ఎంపీ  కావ్య వరంగల్‌లో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పేరు నమోదు చేసుకున్నప్పటికీ, తొర్రూర్‌లో రెండోసారి ఓటు వేయడానికి దరఖాస్తు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తమను అడుగడుగునా పోలీసుల చేత నియంత్రింప చేసి, నిర్బంధించి ఎన్నికల్లో గెలిస్తే, ఇక భవిష్యత్తులో రా జకీయాలు చేసేది ఎలా అంటూ వాపోయా రు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూ డా ఇలాంటి అప్రజాస్వామ్య పద్ధతులను, దౌర్జన్యాన్ని చూ డలేదన్నారు. కక్ష సాధింపు చర్యల వల్ల రాజకీయాల్లో  కొనసాగాలో, తప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. తనను నమ్మిన పార్టీ శ్రేణులకు, వేలాదిమంది కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలంటూ గద్గద స్వరంతో ఎర్రబెల్లి కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఇలాంటి చర్యలకు సహకరించకూడదని కోరారు.