9 June, 2026 | 1:17 AM

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో రాయితీ కల్పించాలి

09-06-2026 12:03 AM

ప్రజావాణిలో టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకుల వినతి

జగిత్యాల, జూన్ 8 (విజయక్రాంతి): జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) పక్షాన సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలను  ఆదేశించాలని డిఈవో రాముకు సూచించారు.

సమస్య తెలుపగానే తక్షణం స్పందించిన అదనపు కలెక్టర్ కు జర్నలిస్టులు యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో కాలం గడుపుతున్నారన్నారు.

జర్నలిస్టు వృత్తినే సామాజిక సేవగా భావిస్తూ పనిచేస్తున్న చాలామంది జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించడా నికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా  విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస్‌రావు, ప్రధా న కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల్ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ,సహాయ కార్యదర్శి గుర్రం చంద్ర శేఖర్, చింత నరేష్, సభ్యులు రాజిరెడ్డి, గాండ్ల వేణు, మనోజ్, జగిత్యాల టౌన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శనిగారపు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అలిశెట్టి మదన్ మోహన్, లక్ష్మారెడ్డి, బుర్ర సత్య నారాయణ గౌడ్, క్రాంతి, రాజు నాయక్, భూషణం, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.