నా సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవు..
విధుల్లోకి తీసుకోవాలి
ఎంపీడీఓ లలిత కుమారి
ముషీరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తనపై జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లుబాటు కావ ని, తన హెచ్‌ఆర్ (హ్యూమన్ రిసోర్స్) ఆమోదించి సేవలను పునరుద్ధరించాలని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీఓ డి.లలిత కుమారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల సంఖ్యలో వ్యత్యాసం ఉన్నట్లు నివేదిక సమర్పించారనే ఆరోపణతో తనను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులను తన వాట్సాప్కు పంపించారని, ఆ ఉత్తర్వులపై అధీకృత అధికారి అయిన కలెక్టర్ సంతకం లేదని, అవి నకిలీవని ఆమె ఆరోపించారు.
టీజీసీసీఏ సర్వీస్ నిబంధనల ప్రకారం ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావని, తాను అప్పీల్ చేసినప్పటికీ విధుల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. తన సస్పెన్ష న్కు సంబంధించి హెచ్‌ఆర్ ఆమోదం లేనప్పటికీ 50 శాతం జీతభత్యాలు చెల్లిస్తున్నారని, దానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదన్నారు. హెచ్‌ఆర్ ఆమోదం, డీడీఓ యాక్సెస్, సర్వీస్ బెనిఫిట్స్, జీతభత్యాలకు సంబంధించిన ఆన్లైన్ సదుపాయాలు నిలిపివేయడంతో తన జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను తిరిగి రెగ్యులర్ ఎంపీడీఓగా విధుల్లో చేర్చుకుని, సర్వీసును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులను లలిత కుమారి విజ్ఞప్తి చేశారు.






