పూజ విషయంలో ఘర్షణ
గుండెపోటుతో పూజారి మృతి
పూజారిపై రెండు వర్గాల ఒత్తిడి కారణం!
నల్లగొండలో విషాదం
నల్లగొండ టౌన్ (తిరుమలగిరి సాగర్), సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గణపతి మండపాల్లో(Ganapati Pandals) మొదటగా మాకే పూజ చేయాలని రెండు వర్గాలు పోటీపడి పూజారిపై తీవ్రమైన ఒత్తిడి చేయడంతో పూజారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన నల్లగొండ పట్టణంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన పూజారి ఉప్పల దత్తు ప్రసాద్(60) తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజ చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు.
దత్తు ప్రసాద్ సోమవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో చింతలపాలెం గ్రామంలోని రామాలయం వద్ద ఉన్న గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య అనే వ్యక్తులు తమ మండపం వద్ద ముందుగా పూజలు నిర్వహించాలని పూజారితో వాగ్వాదానికి దిగారు. పూజారిపై చేయి చేసుకున్నంత పని చేశారు. అనంతరం గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పూజారికి నచ్చజెప్పి, గుండాల రవికి చెందిన గణేష్ మండపం వద్దకు తీసుకెళ్లారు.
పున్నయ్య మండపం వద్ద పూజారి కుమారుడు వల్లభ రాఘవతో పూజ తంతు నిర్వహించానని చెప్పి, రవి మండపం వద్దకు వెళ్లి పూజలు చేస్తుండగా దత్తు ప్రసాద్ ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి కుమారుడు ఉప్పల శ్రీ వల్లభ రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చింతలపాలెంలో రామాలయంకు సంబంధించిన 15 ఎకరాల భూమిని సాగు చేస్తూ దూప దీప నైవేద్యాన్ని నిర్వహిస్తూ ఆ గ్రామంలో పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయి వేరువేరుగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తూ పూజ నిర్వహిస్తున్నారు.