అపోహలతోనే అయోమయం!
- పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన
- ఒత్తిడిని నియంత్రించాం
- సకాలంలో ప్రభుత్వం చర్యలు
- సులభతరమైన గ్యాస్ సరఫరా
- కేంద్ర మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులతో పాటు వంటగ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖల మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషీ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇరాన్, -అమెరికాల మధ్య యుద్ధం ప్రభావంతో పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు పెరిగినందునే అయోమయం నెలకొందని చెప్పారు. భయాందోళనలు పెరగడంతో తాత్కాలికంగా కొంత మేర ఇబ్బంది ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకీ దిగి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో సమర్థవంతంగా ఒత్తిడిని నియంత్రించగలిగామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, డిమాండ్‌కు తగిన రీతిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు పంపిణీదారులతో సమీక్షలు నిర్వహిస్తున్నానని తెలిపారు. అయితే వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ కొరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణాకు వాణిజ్య అవసరాలకు పంపిణీ చేసే కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రం వాణిజ్య అవసరాలకు పంపిణీ చేసే గ్యాస్ కోటా కేటాయింపులను పెంచగలిగితే వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, బ్లాక్ మార్కెట్ కు తరలించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి కేసులు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా నెట్ వర్క్ విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు పోతామన్నారు. హైదరాబాద్‌లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సీఎన్‌జీ సరఫరాను విస్తరిస్తున్నామని, జంట నగరాలలో ఆటోలు, ట్యాక్సీ లతో పాటు ప్రైవేటు వాహనాలకు సీఎన్‌జీ సరఫరాకై ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.




