పౌరసత్వంపై గందరగోళం!
మన దేశంలో పౌరసత్వంపై రాజుకున్న ప్రస్తుత వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు పౌరసత్వానికి పాస్‌పోర్ట్ రుజు వు కాదని, అది ప్రయాణాన్ని సులభతరం చేసే పత్రం మాత్రమేనని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేయడం, మరోవైపు ఆధార్‌కార్డు కేవలం గుర్తింపు పత్రమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో చెప్పడం తాజా వివాదానికి కారణమైంది. దీంతో సహజంగానే పౌరసత్వాన్ని అధికారికంగా ఎలా నిరూ పించుకోవాలనే ప్రశ్న ప్రజల ముందుకు వస్తున్నది.
వాస్తవానికి పౌరసత్వానికి సంబంధించి పౌరసత్వ చట్టం 1955ని మన రాజ్యాం గంలో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం 1950 జనవరి 26 లేదా ఆ తర్వాత దేశంలో పుట్టినవారు, వారి కుటుంబ సభ్యులను సహజంగానే భారతీయులుగా పరిగణిస్తారు. ఆ తర్వాత 1987లో ఈ చట్టానికి కీలక సవరణలు చేశారు. దీని ప్రకారం 1987 తర్వాత జన్మించిన పౌరుల తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉంటే సరిపోతుంది. కాగా, పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం ప్రత్యేక పత్రాన్ని జారీచేయకపోవడం ప్రస్తుత గందరగోళానికి ప్రధాన కారణం.
ఆధార్, ఓటరు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను ప్రజలు తమ గుర్తింపు పత్రాలుగా ఇప్పటివరకు ఉపయోగిస్తూ వచ్చారు. అదే సమయంలో ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో డ్రైవింగ్ లైసెన్స్, జన్మదిన, విద్యార్హత, కుల ధ్రువీకరణ వంటి 11 పత్రాలను ప్రామాణికంగా తీసుకుంటున్నది. అయి తే, వీటిలో ప్రతి పత్రం ఒక నిర్దిష్ట అవసరానికి మాత్రమే జారీచేసిన విషయాన్ని విస్మరించకూడదు.
ఆధార్ కార్డు వ్యక్తిగత గుర్తింపునకు, ఓటుహక్కు కోసం ఓటరు కార్డు, పన్ను చెల్లింపుల నిమిత్తం పాన్ కార్డు, విదేశీ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్‌లను ప్రభుత్వం జారీచేసింది. ఇవి పౌరసత్వానికి రుజువులని చట్టంలో ఎక్కడా లేదు. ఇతర దేశాలు పాస్‌పోర్ట్ ఆధారంగా భారత పౌరులను గుర్తిస్తున్నప్పటికీ, మన దేశంలో కోట్ల మందికి అందుబాటులో లేని పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి రుజువు అని పేర్కొనడం ఏమాత్రం సబబు కాదు.
ఈ నేపథ్యంలో పౌరసత్వ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు మార్గదర్శకాలు రూపొందించాలి. ఈ క్రమంలో ఏ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నా పౌరసత్వాన్ని నిరూపించుకునే విషయంలో పౌరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది.






