ఉద్యమకారులకు న్యాయం జరిగేనా!
దేవీప్రసాద్ :
* కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు అనేక హామీలిచ్చింది. ముఖ్యంగా అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి, అమరులకు మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ముఖ్యమైనవి తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో అమరులైనవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నెలకు రూ.25,000 పెన్షన్ ఇస్తామన్న హామీ.
అయితే, ఇప్పటివరకు సర్కార్ కనీసం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. చివరికి ఉద్యమకారులు వివిధ సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే, ఉద్యమకారుల గుర్తింపు కోసం, విధివిధానాలు రూపకల్పన కోసం రాజ్యసభ మాజీ సభ్యులు కేశవరావు నాయకత్వంలో పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులతో ఒక సబ్ కమిటీ వేసింది. అయితే, మొత్తానికి కార్యాచరణకు సిద్ధం కావడాన్ని అందరూ స్వాగతించాలి.
* అన్ని యూనివర్సిటీలు 2009-2014 వరకు ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారు. అనేక మంది జైలు జీవితం గడిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమకారులకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలలో రిజర్వేషన్, ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్య మం దాదాపు ఆరు దశాబ్దాలు వివిధ దశల్లో, రూపాలలో జరిగింది. మలి దశ ఉద్యమకారుల కుటుంబాల వివరాలు సేకరించడానికి సలహాల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక సూచనలు చేశారు. అయితే, ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలను కూడా ఆహ్వానించడం విడ్డూరం. తమను కూడా గుర్తించి పిలవాలని జనసేన డిమాండ్ చేయడం ద్వారా కమిటీ ప్రయత్నాల పట్ల అనుమానం వచ్చే అవకాశం ఉంది.
1952, 1969 ఉద్యమాలలో పాల్గొన్న క్రియాశీలక ఉద్యమకారులు కొంతమంది ఉన్నారు. వారి సలహాలు కూడా తీసుకోవాలి. మలిదశ ఉద్యమం చాలా విస్తృత విశాల ప్రజా ఉద్యమంగా కొనసాగింది. ఇందులో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు విప్లవ పార్టీలు, కవులు, కళాకారులు, మేధావులు. అనేక సంస్థలు పాల్గొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనులు పా ల్గొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా గౌరవ పెన్షన్ ఇవ్వలిసిన అవసరం ఉంది. నాడు చాలామంది అమరుల వివరాలు పోలీస్ స్టేషన్లలో అసహజ మరణంగా నమోదు కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై విస్తృత చర్చ జరిపి అందరికి న్యాయం జరిగేలా విధానాల రూపకల్పన చేయాలి.
గత కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 612 మంది అమరులను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. కానీ ఉద్యమకాలంలో జేఏసీతో సహా అనేక సంఘాలు అమరుల సంఖ్య 1400కి పైన ఉన్నాయని ప్రకటించాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ అమరుల వివరాలతో పుస్తకం ప్రచురించింది. దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.
ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వం రథసారథి ద్వారా 582 మందికి ఉద్యోగాలు కల్పించింది. దాదాపు 4 లక్షల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చింది. అయితే పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సహాయం అందలేదు. రకరకాల చట్టాలు, ప్రభుత్వ నిబంధనల వల్ల అందరికీ ప్రయోజనం చేకూరలేదు. ఉద్యమ ప్రయోజనాలు లభిస్తాయని భావించిన ఉద్యమకారులకు నిరాశ తప్పలేదు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గౌరవ భృతి అందిస్తామని మరో హామీ ఇచ్చారు. మలి దశ ఉద్యమంలో పాల్గొన్న వారు అన్ని వర్గాలలో ఉన్నారు. వారితో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించే ప్రయత్నం చేయాలి. కోదండరాంపై ప్రధాన బాధ్యత ఉంది. ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన నాటి ఉద్యమ నేతలు రాజకీయ, ప్రజా సంఘాల ఉద్యమ సంస్థలను సంప్రదించాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పుష్కర కాలం పూర్తయింది.
ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా ఇప్పుడు ఉద్యమకారులమని చెప్పి ప్రభుత్వ సహాయం కోసం ముందు వరసలో నిలబడి ఉన్నారు. ఉద్యమంలో లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరికీ ధైర్యం అనే విషయం అందరికీ తెలుసు. తాము ఏ వరుసలో ఉన్నా తమకు వడ్డిస్తారనే నమ్మకంతో ఉన్న ఉద్యమంలో పాల్గొననివారు, ఉద్యమకారుల అణచివేతలో భాగమైన వారి పట్ల ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి.
వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా నుంచి విముక్తి చేశామని చెబుతున్న ప్రభుత్వానికి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడానికి మనసు రావడం లేదు. ఉద్యమకారుల సంక్షేమం కోసం, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి కేటాయింపులు మూడు బడ్జెట్లలో చేయలేదు. 42 రోజుల సకలజనుల సమ్మె, పది రోజుల పెన్ డౌన్‌తో పాటు అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారుల కోసం, తమ అమూల్య ప్రాణాలను అర్పించిన అమరవీరులకు తెలంగాణ బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో అనే సందేహం అందరిలో నెలకొంది.
ఉద్యమకారులు తెలంగాణ ఏర్పడ్డ తరువాత వివిధ రాజకీయ పార్టీలలో భాగమయ్యారు. కోదండరాం స్వయంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఇలాంటి స్థితిలో సహజంగానే ఉద్యమకారుల పేరిట అనేక సంస్థలు ఏర్పడ్డాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రచారం చేస్తూ వినతులు ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని ఆందోళనకు దిగుతున్నాయి.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు వీలైతే అందరూ కలసి లక్ష్య సాధన కోసం పని చేయాలి. లేకపోతే సమాంతరంగా పని చేయాలి. కానీ, ఘర్షణలకు మాత్రం తావు ఉండకూడదు.
ఉద్యమకారుల గుర్తింపు వివిధ దశలలో జరగాలి. తొలి ప్రాధాన్యత అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం, రెండవ ప్రాధాన్యత నెలల తరబడి జైలు జీవితం, నిర్బంధం ఎదుర్కొన్న కుటుంబాలు, మూడవ దశలో ఉద్యమాలలో పాల్గొన్న అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్య, వృత్తిపరంగా నష్టపోయిన అనేక కుటుంబాలకు ప్రాధాన్యం దక్కాలి.
దీంతో పాటు 1969 తెలంగాణ ఉద్యమం లక్ష్యం సాధించకపోవడంతో వివిధ సామాజిక ఉద్యమాలలో ప్రజల కోసం పని చేసి ప్రాణాలు కోల్పోయిన వేలాది కుటుంబాల విషయం కూడా ఆలోచించాలి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న లక్షలాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 1972 నుంచి పెన్షన్ ఇస్తున్నది. ఆ పథకం విధివిధానాల నుంచి అవసరమైన అంశాలను తీసుకోవాలి.
అయితే, బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముందు హాజరై పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత కమిటీకి ఎలాంటి అధికారాలు లేవని, అందువల్ల చట్టబద్ధమైన కమిషన్‌గా మార్చాలని కోరారు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర యోధులుగా గుర్తించి అన్ని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించాలని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని, ఉద్యమ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
2009 నుంచి 2014 వరకు అన్ని యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. విద్యార్థులు తమ ఉద్యోగ అవకాశాలను ఉద్యమ సందర్భంగా కోల్పోయారు. అనేక మంది జైలు జీవితం గడిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమకారులకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలలో రిజర్వేషన్, ప్రత్యేక చట్టం ద్వారా ఉద్యోగాలు కల్పించడం, పరిశ్రమలు, ఇతర సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి.
జర్నలిస్టులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అనేక నిర్బంధాలకు, యాజమాన్య వేధింపులకు గురయ్యారు. లాయర్లు, డాక్టర్లు, ఇతర వృత్తులలో ఉన్నవారు ఉద్యమ కాలంలో అనేక నష్టాలను చవిచూశారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి. అయితే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు ఎవరూ తమకు వ్యక్తిగతంగా న్యాయం జరగాలని కోరుకోలేదు. తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలన్న ఆశయంతో ఉద్యమాలలో పాల్గొన్నా రు.
ఉద్యమంలో పాల్గొన్న కోట్లాది ప్రజలకు న్యాయం జరిగే విధంగా విధానాలు రూపొందించి పరిపాలన చేయడమే ధ్యేయంగా ముందుకుసాగితే అమరుల ఆశయాలు నెరవేరుతాయి. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలల్లో విశ్వాసం కల్పించడానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను స్థాపించి సంక్షేమాన్ని నిరంతరం కొనసాగించే విధంగా కృషి చేయాలి. కేశవరావు కమిటీ కాలయాపన కమిటీగా మారకుండా కార్యాచరణ ప్రణాళిక రూ పొందించాలి.
వ్యాసకర్త: ఉద్యోగ సంఘాల జాక్ పూర్వ చైర్మన్,
9000633404






