22 July, 2026 | 4:19 PM

ఐఐటీ మద్రాస్‌లో M.Tech సీటు.. మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు

22-07-2026 03:49 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం అందుగులగూడెం స్టేజి గ్రామానికి చెందిన మోకాళ్ల భాను ప్రసాద్ ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్లో ఎం.టెక్ (CEM) కోర్సులో ప్రవేశం పొందడం విశేషం. మోకాళ్ల శ్రీనివాసరావు–రాధ దంపతుల కుమారుడైన భాను ప్రసాద్ GATE–2026 పరీక్షలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో 302 స్కోర్ సాధించి, ఇటీవల నిర్వహించిన అడ్మిషన్ ప్రక్రియలో ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ (CEM) సీటును కైవసం చేసుకున్నారు.

జూలై 20, 2026న ఆయన అధికారికంగా ఐఐటీ మద్రాస్‌లో చేరారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమారుడి కృషి, పట్టుదల, క్రమశిక్షణతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ఈ విజయానికి కారణమని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సివిల్స్‌లోనూ విజయం సాధించి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. భాను ప్రసాద్ సాధించిన ఈ విజయంపై బంధుమిత్రులు, అధ్యాపకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.