విద్యార్థుల ఉన్నత శిఖరాలకు క్రీడలే పునాదిరాళ్లు
– జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా సమానంగా దృష్టి సారిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కూడా పెంపొందుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రధానోపాధ్యాయురాలు పూర్ణిమ, డీఎస్పీ శ్రీనివాసులతో కలిసి అండర్-14, 17, 19 విభాగాల రాష్ట్ర స్థాయి నవోదయ విద్యాలయాల ఖో-ఖో క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని, ఇవే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు పునాదిరాళ్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు జూలై 22 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.






