3 August, 2026 | 8:00 AM

సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

22-06-2024 12:58 AM

సింగరేణి విషయంలో రాష్ట్రానికి బండి సంజయ్ సవాల్

కరీంనగర్, జూన్ 21 (విజయక్రాంతి): సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణి పై తప్పుడు ప్రచారం, ప్రజలను అయోమ యం చేసే కుట్ర జరుగుతుందన్నారు. మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారని గుర్తుచేశారు.

సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమేనని, రాష్ట్రానికి 51 శాతం ఉందన్నారు. దీంతో ప్రైవేటీకరణకు రాష్ట్ర అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం, బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, తాడిచర్లలో ఏపీ జెన్‌కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని, ఆయన మూర్ఖత్వపు ఆలోచనలతో పూర్తిగా దెబ్బతీశారని, తన కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో అవినీతి చేస్తే, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారని అన్నారు. కాంగ్రెస్ కూడా అంతేనని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వేరే ఆలోచన లేదన్నారు.