4 March, 2026 | 4:43 AM

ఇస్నాపూర్ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్‌పై అనర్హత వేటు!

04-03-2026 12:00 AM
  1. విప్ ధిక్కరించినందుకు మాధవిపై చర్యలు  
  2. అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ అధికారుల ప్రకటన

సంగారెడ్డి, మార్చి 3(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించడంతో ఓ కౌన్సిలర్‌పై అనర్హత వేటుపడింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల మాధవి నరేందర్‌రెడ్డిపై అనర్హతగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 10 కాంగ్రెస్, 12 బీఆర్‌ఎస్, 4 వార్డులను స్వతంత్రులు గెలుపొందారు. అయితే చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ వైపునకు ముగ్గురు స్వతంత్రులు వెళ్లారు.

అనూహ్య పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 8వ వార్డు నుంచి గెలుపొందిన మాధవి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపి వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ భార్యను చైర్‌పర్సన్‌ను చేసేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఆమెకు ఆ పదవి దక్కనీయకుండా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చక్రం తిప్పారు.

వీరిద్దరి ఎక్స్ అఫిషియో ఓట్లు ఇక్కడే నమోదు చేసుకొని బీఆర్‌ఎస్ అభ్యర్థిని చైర్‌పర్సన్‌గా గెలిపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పార్టీ విప్ జారీ చేసినప్పటికీ 8వ వార్డు కౌన్సిలర్ మాధవి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడాన్ని సవాల్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు కౌన్సిలర్ మాధవిపై అనర్హత వేటు వేస్తూ ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.