29 May, 2026 | 2:35 AM

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి

29-05-2026 02:05 AM
  1. కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం.. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 
  2. బోడుప్పల్ బీఆర్‌ఎస్ సమావేశంలో మేడ్చల్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి

మేడిపల్లి, మే 28 (విజయక్రాంతి): మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి అని మేడ్చల్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డి, చామకూర మహేందర్ రెడ్డి హాజరై, బూత్ కమిటీ సభ్యులకు నూతన డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ ఐ ఆర్ (ఓటర్ల జాబితా సవరణ) అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాల్లో అధికారం కోల్పో వడం తాత్కాలికమేనని, విపక్షంలో ఉండే ఈ సమయం పార్టీ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నా రు.

గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సోషల్ మీడియా వారియర్స్ తయారుచేయడమే లక్ష్యమని తెలిపారు. యువతను ఆకర్షించేందుకు డిజిటల్ సభ్యత్వ నమోదు కీలకమని అన్నారు. బీఆర్‌ఎస్లో చేరే ప్రతి కార్యకర్తకు తెలంగాణ పునర్నిర్మాణంలో రెండో దశ ఉద్యమమనే భావన కల్పించాలని నాయకులు పిలుపునిచ్చారు. నాయకత్వం క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలకు ఆర్థిక భరోసా కంటే ఆత్మగౌరవ భరోసా, రాజకీయ రక్షణ చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు.

కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే, లీగల్ సెల్ ద్వారా తక్షణ ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, స్థానిక నేతలు ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బోడుప్పల్ నాయకులు కొత్త రవి గౌడ్ మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, జావీద్ ఖాన్, ఆకుల మధుకర్, కీర్తణ్,మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, బూత్కమిటీసభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.