22 July, 2026 | 11:22 AM

జర్నలిస్టు పెండ్యాల రామ్ కుమార్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

22-07-2026 10:50 AM

మంథని, జూలై 22(విజయక్రాంతి): అనారోగ్యంతో చికిత్స పొందిన సీనియర్ జర్నలిస్టు, స్టాఫ్ రిపోర్టర్ పెండ్యాల రామ్ కుమార్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో రెండు రోజులపాటు చికిత్స పొందిన రామ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రామ్ కుమార్ కుమార్తె పెండ్యాల శ్రీనిధిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీలో అత్యుత్తమ మార్కులు సాధించి, ఈ-సెట్‌లో 15 వేల ర్యాంక్‌తో మంథని జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐఎంఎల్) విభాగంలో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యను కృషితో పూర్తి చేసి మంచి ఉద్యోగావకాశాలు సాధించాలని ఆశీర్వదించారు.

అదే సందర్భంగా జేఎన్టీయూ విద్యార్థులు, సిబ్బంది సౌకర్యార్థం మంథని బస్టాండ్ నుంచి జేఎన్టీయూ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థిని శ్రీనిధి మంత్రిని కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, శ్రీరాంభట్ల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని సత్యంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.