22 July, 2026 | 11:26 AM

మహిళ హత్యలో నిందితుడి అరెస్ట్

22-07-2026 10:21 AM

నర్సాపూర్, జూలై 22: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్చారం మండలం వరిగుంటం గ్రామానికి చెందిన మెట్టు షేకమ్మ (40) ఈ నెల 17న నర్సాపూర్ బస్టాండ్ సమీపంలోని పొదల్లో చేతులు కట్టబడిన స్థితిలో మృతిగా కనిపించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఈ నెల 16వ తేదీ రాత్రి శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన కట్రోత్ సురేష్ రూ.500 ఇస్తానని ఆశ చూపి షేకమ్మను పొదల్లోకి తీసుకెళ్లి, ఆమె చేతులను వైర్‌తో కట్టి, చీరతో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం మృతురాలి మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సంఘటనా స్థలంలో స్పష్టమైన ఆనవాళ్లు లేకపోవడం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు సవాలుగా మారినప్పటికీ, సాంకేతిక ఆధారాలు, గ్రామాల్లో సమాచార సేకరణ, ప్రజల సహకారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. కేసును సమర్థంగా ఛేదించిన నర్సాపూర్ సీఐ రంగా కృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. అనుమానాస్పద ఘటనలు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే నేరాలను త్వరగా ఛేదించగలమని డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.