నిరుద్యోగులకు కాంగ్రెస్ మోసం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏది?
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హామీలిచ్చి వెళ్లారని, ఇప్పుడు ఆ హామీలను ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం జిల్లా మధిరలో వేణుకుమార్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిపై ప్రభుత్వం ఇంత వరకూ స్పందించలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు బకాయిల కోసం తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని, జాబ్ నోటిఫికేషన్లు వేయాలని ఆంధోళన చేస్తున్న నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలు కోసం పోరాడుతున్న విద్యార్థులపై జిల్లాల్లో లాఠీ చార్జ్ చేస్తున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమని, విద్యార్థులంతా ఏకమై త్వరలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.






