3 August, 2026 | 3:31 AM

బహదూర్‌గూడలో మళ్లీ అలజడి

03-08-2026 02:22 AM

రైతుల రిలే దీక్ష భగ్నం 

అనుమతి లేదన్న పోలీసులు 

శంషాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్‌గూడలో మళ్లీ అలజడి రేగింది. ఆదివారం ఉదయం శంషాబాద్ పోలీసులు చేరుకుని, రిలే దీక్షలు చేస్తున్న రైతులను అనుమతి లేదని భగ్నం చేశారు. రిలే దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇతరత్రాలను తొలగించారు. గతంలో రైతులు తమ భూములను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించవద్దని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా లక్ష్మీ తండాలో దీక్షలు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల హైడ్రా ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సుమారు 650 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం విధితమే. ఇదిలా ఉండగా మూడు రోజులుగా బహదూర్గుడ గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని చవిడి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం భారీగా పోలీసులు గ్రామానికి చేరుకొని ఉన్నతాధికారుల నుంచి దీక్షలకు అనుమతి లేదని భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా పోలీసు అడ్డుకోవడం సరికాదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి తమకు సరైన పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.