22 May, 2026 | 12:23 PM

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

20-04-2024 01:41 AM

l జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ

l సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే:  మైనంపల్లి హన్మంతరావు

మెదక్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఇందిరమ్మను ప్రధాని చేసిన మెదక్ గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లా కంచుకోటని, ఇక్కడి నుంచి ఇందిరమ్మ పోటీ చేసి దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక వర్గానికి చెందిన ముద్దుబిడ్డ నీలం మధును గెలిపించి మళ్లీ ఇందిరమ్మ పాలనకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ జాతీయ నేత కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు కాంగ్రెస్ మిషన్ లక్ష్యంగా పని చేస్తున్నామ ని, ఇందులోనే మెదక్ ఎంపీ సీటు కూడా ఉంటుందని చెప్పారు. ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ గెలుపుకోసం అంకితభావంతో పనిచేయాలన్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని కోరారు. 

సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే : మైనంపల్లి

తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని, సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు దోచుకోవడమే కాకుండా అప్పులపాలు చేసిన బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. బీసీ బిడ్డ నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలన్నారు. మెదక్‌లో సీఎం సభకు పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ ఇన్‌ఛార్జి ఆవుల రాజీరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు, గంగా నరేంద ర్, జీవన్‌రావు, ఉప్పల రాజేశ్, బొజ్జ పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి సురేఖ, హన్మంతరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.