తంగళ్లపల్లి క్లూతో 86 కేసుల చైన్ స్నాచర్ అరెస్ట్
గంటన్నరలోనే కేటుగాడిని పట్టుకున్న హుస్నాబాద్, సీసీఎస్ పోలీసులు
హుస్నాబాద్ (విజయక్రాంతి): హుస్నాబాద్‌లో వృద్ధురాలిని మోసం చేసి బంగారు చైన్ ఎత్తుకెళ్లిన నిందితుడిని కేవలం 90 నిమిషాల్లోనే పట్టుకుని హుస్నాబాద్ పోలీసులు తమ అప్రమత్తతను చాటిచెప్పారు. పట్టుబడిన అల్లెపు కృష్ణ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన 86 దోపిడి, రాబరీ కేసుల్లో నిందితుడని హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం వెల్లడించారు. అయిలేని లక్ష్మీ (76) అనే వృద్ధురాలికి నెలకు రూ.4 వేల పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించిన అల్లెపు కృష్ణ, గాయత్రి బ్యాంక్ వద్ద మాయమాటలతో ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్ తీసుకుని పరారయ్యాడు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్ నరేష్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో తంగళ్లపల్లిలో గతంలో ఇదే తరహాలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు, అందులో అల్లెపు కృష్ణ పేరు గుర్తుకు రావడంతో పోలీసులు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్ బృందం సీసీ ఫుటేజ్, పాత నేర చరిత్ర ఆధారంగా గాలింపు చేపట్టి హుస్నాబాద్ బస్టాండ్ వద్ద ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి గంటన్నరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు పెండ్యాల దేవేందర్, రవీందర్, ఎస్ఐ తిరుపతి, హుస్నాబాద్ ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు యాదగిరి, నాగేష్, కానిస్టేబుల్ నరేష్‌లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలు తమ ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. హుస్నాబాద్ సీఐ కె శ్రీనివాస్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






